తాజావార్తలు

Health tips: కళ్ల కింద నల్లటి వలయాలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Health tips: కళ్ల కింద నల్లటి వలయాలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి


నేటి బిజీ జీవితంలో కళ్ల కింద నల్లటి వలయాలు రావడం అనేది సాధారణంగా మారిపోయింది. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ లక్షణం.. ఇప్పుడు యువత, పిల్లల్లో కూడా కనిపిస్తోంది. శరీరంతోపాటు కళ్లకు విశ్రాంతి లేకుండా గడపడం వల్ల అలసట ఏర్పడుతుంది. దీంతో ఉదయం లేవగానే అద్దంలో చూసుకుంటే కళ్ల కింద నల్లటి వలయాలు కనిపిస్తుంటాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టీవీల వాడకం అతిగా పెరగడం, ఆలస్యంగా నిద్రించే అలవాటు, జీవనశైలిలో మార్పులు కళ్ల కింద నల్లటి వలయాలకు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

నల్లటి వలయాలకు చాలా కారణాలు ఉన్నాయి. మొబైల్ ఫోన్లు ఎక్కువ వాడటం వల్లే ఇలా జరుగుతుందని కొందరు చెబుతారు. కళ్ల కింద నల్లటి వలయాలు కనిపించగానే ఆందోళనతో ఇంటి చిట్కాలు, ఇంటర్నెట్‌లో లభించిన సమాచారంతో చాలా మంది నివారణలకు ఉపక్రమిస్తారు. ఖరీదైన క్రీములు, చికిత్సలు పరిష్కారంగా భావిస్తారు. అయితే, వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రలేకపోవడం నల్లటి వలయాలకు కారణమా?

నిద్ర లేకపోవడం వల్లే నల్లటి వలయాలు వస్తాయనేది పెద్ద అపోహేనని చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ ఇషితా పండిట్ చెబుతున్నారు. కానీ, ఇది ప్రతీసారి నిజం కాదంటున్నారు. చాలా సందర్భాల్లో నల్లటి వలయాలు జన్యు పరమైనవి కావచ్చని చెబుతున్నారు. దీంతోపాటు కళ్ల కింద చర్మం సన్నబడటం, పిగ్మేంటేషన్, సైనోసిస్ లేదా రక్తహీనత వంటి సమస్యలూ కూడా నల్లటి వలయాలకు కారణం కావచ్చంటున్నారు.

క్రీంలు నల్లటి వలయాలను తొలగిస్తాయా?

ఏదైనా క్రీమ్ అప్లై చేయడం వల్ల నల్లటి వలయాలు తొలగిపోవని వైద్యులు అంటున్నారు. ముందుగా నల్లటి వలయాలకు మూల కారణాన్ని అర్థం చేసుకోవాలన్నారు. కారణం తెలియకుండా ఏదైనా క్రీమ్ వాడటం ప్రభావవంతంగా ఉండదని స్పష్టం చేస్తున్నారు.

ఇంటి చిట్కాల ప్రభావం ఎంత?

బంగాళదుంప రసం, నిమ్మరసం, లేదా టమాట రసం పూయడం వల్ల నల్లటి వలయాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. కానీ, వాస్తవానికి ఈ చికిత్సలు చర్మానికి కొంత వరకు మాత్రమే హైడ్రేషన్ అందిస్తాయి. అవి సమస్య మూలకారణాన్ని పరిస్కరించవు. కొన్నిసార్లు ఇలాంటి చర్యలు చర్మానికి అలర్జీలు, చికాకులు కూడా కలుగుతాయని చెబుతున్నారు.

నల్లటి వలయాలు పిగ్మెంటేషన్ వల్ల మాత్రమే వస్తాయా?

నల్లటి వలయాలు పిగ్మెంటేషన్ వల్ల మాత్రమే వస్తాయని కొందరు అనుకుంటారు. కానీ, నిపుణులు మాత్రం ఇది పూర్తిగా కాదని అంటున్నారు. కళ్ల కింద వలయాలు చర్మ ఆకృతిలో మార్పుల వల్ల కూడా రావచ్చంటున్నారు. వృద్ధప్య కారణంగా చర్మం వదులుగా మారినా ఇలాంటివి వస్తాయంటున్నారు.

నల్లటి వలయాలకు చికిత్స

చాలా మంది నల్లటి వలయాల తొలగింపు విధానాలు ప్రమాదకరమని భావిస్తారు. కానీ, చికిత్సను శిక్షణ పొందిన, అనుభవజ్ఞులైన చర్మ వ్యాధి నిపుణుల నుంచి తీసుకుంటే.. అది పూర్తిగా సురక్షితమని వైద్యులు చెబుతున్నారు. లేజర్ థెరపీ, పీఆర్పీ, ఫిల్లర్లు, స్కిన్ బూస్టర్లు వంటి ఆధునిక పద్ధతులు సురక్షితం. వీటితో మంచి ఫలితాలు ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *