దేశంలో ఉద్యోగం చేసేవారికి ఆర్ధిక భద్రత కల్పించేందుకు అనేక చట్టాలు, నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాటిల్లో గ్రాట్యుటీ ఒకటి. మీరు సంస్థకు చేసిన సేవ, కష్టానికి ప్రతిపలంగా ఉద్యోగం మానేసి వెళ్లిపోయే సమయంలో కంపెనీలు గ్రాట్యుటీ అనేవి చెల్లిస్తూ ఉంటాయి. 1972, సెప్టెంబర్ 16న గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం 10 లేదా అంతకంటే ఎక్కువమందిని నియమించుకునే సంస్థల్లోని ఉద్యోగులకు ఈ చట్టం వర్తిస్తుంది
ఒకేసారి పెద్ద మొత్తంలో ఉద్యోగికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల గ్రాట్యుటీ రూల్స్‌లో పలు మార్పులను కేంద్రం తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపుల్లో అనేక కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో కనీసం ఒక కంపెనీలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటేనే గ్రాట్యూటీ చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక ఏడాది చేసినా యాజమాన్యం ఉద్యోగికి గ్రాట్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ఉద్యోగికి ఆర్ధిక భరోసా కల్పిస్తోంది.
ఒక ఏడాది సర్వీస్ పూర్తి చేసినా గ్రాట్యూటీ చెల్లింపు విషయంలో కొన్ని రూల్స్ అమలు చేస్తున్నారు. నిర్ణీత కాలానికి నియమించుకున్న ఉద్యోగులకు మాత్రమే ఏడాది పూర్తి చేసినా గ్రాట్యూటీ చెల్లించాలి. శాశ్వత ఉద్యోగులకు ఇది వర్తించదు. శాశ్వత ఉద్యోగులు 5 సంత్సరాల పనికాలం పూర్తి చేస్తే గ్రాట్యుటీకి అర్హులు.
ఒకటి లేదా రెండు, మూడు సంవత్సరాలు లాంటి నిర్దిష్ట కాలానికి నియమించుకున్న ఉద్యోగులు, శాశ్వత సిబ్బంది కానివారికి చెల్లించాలని చట్టంలో పొందుపర్చారు. ఇక కంపెనీ ద్వారా నేరుగా ఉద్యోగం పొందినవారు మాత్రమే ఒక ఏడాది సర్వీస్ తర్వాత గ్రాట్యూటీ పొందేందుకు అర్హులు. థర్డ్ పార్టీ ఏజెంట్ల ద్వారా రిక్రూట్ అయితే ఇది వర్తించదు.
ఉద్యోగి బేసిస్ వేతనం, డీఏ, రిటైనింగ్ అలవెన్సులు కలిపి గ్రాట్యూటీ లెక్కిస్తారు. ఉద్యోగికి అయ్యే మొత్తం ఖర్చు సీటీసీలో 50 శాతంగా ఉండాలి. నవంబర్ 21,2025న కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల్లో గ్రాట్యూటీ నిబంధనల్లో ఈ మార్పులు చేశారు. దీంతో ఉద్యోగులకు ఊరట కలిగినట్లయింది.





