మందుబాబులకు బ్యాడ్ న్యూస్. మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్దం, గల్ప్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులే దీనికి కారణంగా తెలుస్తోంది. యుద్దం ఎఫెక్ట్ ప్రపంచ దేశాలతో పాటు భారత్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో సరఫరా గొలుసుకు అంతరాయం కలగడం వల్ల మద్యం తయారీకి అవసరమయ్యే ముడి సరుకు ధరలు పెరుగుతున్నాయి.
గ్యాస్ కొరత వల్ల గాజు బాటిళ్ల తయారీ భారంగా మారింది. గ్యాస్ ధరలు పెరగడం, కమర్షియల్ గ్యాస్‌కు కొరత వల్ల గాజు బాటిళ్ల పరిశ్రమ కుదేలవుతోంది. గాజు బాటిళ్ల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయి. దీని వల్ల మద్యం ధరలు కూడా పెరగనున్నట్లు ఇండియన్ మాల్ట్ విస్కీ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ చోప్రా స్పష్టం చేశారు.
ఇక యుద్ద ప్రభావం వల్ల సరఫరాకు అంతరాయం కలగడం వల్ల రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. ఇక బీర్ల కాన్ల తయారీకి వాడే అల్యూమినియం ధరలు కూడా 15 శాతం పెరిగాయి. దీని వల్ల కంపెనీలు అదనంగా మద్యం ధరలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో త్వరలోనే మద్యం ధరలను పెంచే అవకాశముంది.
అటు వేసవిలో బీర్ల కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలే దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో టెంపరేచర్ మరింత పెరిగే అవకాశముంది. అయితే గ్యాస్ సరఫరా సమస్య ఇలాగే కనొసాగితే గాజు ఫర్నెస్ లు పూర్తి సామర్థ్యంతో పని చేయలేవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వేసవిలో బీర్ల డిమాండ్‌కు తగ్గ సరఫరా తగ్గనుంది. దీని వల్ల బీర్ల కొరత ఏర్పడే అవకాశముందని తెలుస్తోంది. దీంతో మందుబాబులకు త్వరలో బిగ్ షాక్ తప్పదని తెలుస్తోంది. మద్యం ధరలు భారీగా పెరిగే అవకాశముందని సమాచారం.





