
ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో భారత్ ప్రస్తావన అన్నది సమంజసమని ప్రధాని మోదీ అన్నారు. 2014 నాటి పరిస్థితులను అధిగమించి భారత్ నేడు ఒక ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తోందని ప్రధాని వివరించారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటోందని అన్నారు. కరోనా తర్వాత సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయని ప్రధాని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల ఐకమత్యంతో అన్ని సవాళ్లను భారత్ అధగిమిస్తూనే ఉందని అన్నారు. భారత్ శక్తిసామర్థ్యాల చూసి ప్రపంచ దేశాలు విస్తుపోతున్నాయని ప్రధాని తెలిపారు.
ఫిబ్రవరి 28 తర్వాత చోటుచేసుకున్న విపరీత పరిణామాల తర్వాత కూడా భారత్ సంకల్పం తీసుకొని అభివృద్ధి పథంలో ముందుకు పోతోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ 23 రోజుల్లో ప్రపంచానికి భారత్ తన శక్తి సామర్ధ్యాలు చూపిందని గుర్తు చేశారు. భారత్ అన్ని దేశాలకు విశ్వసనీయ భాగస్వామని ప్రధాని తెలిపారు. సంక్షోభ సమయంలో భారత్ తన పోరాటపటిమను ప్రదర్శించిందని అన్నారు. పౌరులకు చిన్న కష్టం కూడా రాకుండా చూస్తున్నామని ప్రధాని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో పెట్రో సంక్షోభం వచ్చినప్పుడు కాంగ్రెస్ దేశం గురించి ఆలోచించకుండా తన అధికారం కాపాడుకోవడంపై దృష్టి పెట్టిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయిల్ బాండ్స్ నిర్ణయం తప్పని తెలిసినా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందని అన్నారు. నాటి నిర్ణయాన్ని నేడు ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతల నోరు మూతపడిపోతోందని ప్రధాని తెలిపారు.
ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల ప్రభావం ప్రతీ దేశంపై ఉందని ప్రధాని మోదీ అన్నారు. కొందరు యుద్ధం పేరు చెప్పి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రధాని తెలిపారు. అలాంటి వారికి టీవీ నైన్ వేదికగా సంయమనం పాటించమని కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. యుద్ధం కొనసాగిన ఈ 23 రోజుల కాలంలో భారత దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. గడిచిన నెల రోజుల్లో రైతుల ఖాతాల్లోకి కిసాన్ సమ్మాన్ నిధులు జమ చేసిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు.
2014కు ముందు పది, పదకొండు ఏళ్లు, 2014 తర్వాత పది, పదకొండు ఏళ్లను చూస్తే దేశంలో చోటుచేసుకుంటున్న మార్పును స్పష్టంగా గమనించవచ్చని ప్రధాని మోదీ అన్నారు. ప్రతీ రంగంలో పరివర్తన తెచ్చామని తెలిపారు. గతంలోనూ పథకాల రూపకల్పన జరిగేదని, కానీ ఇప్పుడు పరిణామాలు కూడా కనిపిస్తున్నాయని అన్నారు.
దేశంలో తూర్పు ప్రాంతాన్ని గత ప్రభుత్వాలు ఉపేక్షించాయని, ఇప్పుడా పరిస్థితి లేదని ప్రధాని మోదీ తెలిపారు. అస్సాం, బిహార్, ఒడిశా, యూపీ, బెంగాల్ రాష్ట్రాల అభివృద్ధిని ప్రధాని ప్రస్తావించారు. కానీ బెంగాల్‌లో ప్రస్తుతమున్న ప్రభుత్వం అభివృద్ధికి బ్రేకులు వేసిందని అన్నారు. మమత సర్కారు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అడ్డుకున్న విషయాన్ని టీవీ నైన్ బంగ్లా ప్రేక్షకులకు తెలుసని వివరించారు. అభివృద్ధిని విస్మరించి రాజకీయాలకు పాల్పడే తీరును మొదలుపెట్టిన పార్టీలు ఆ తప్పుల నుంచి బయటపడలేవని ప్రధాని హెచ్చరించారు.
దేశంలో అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా కాంగ్రెస్ పెట్టుకుందని ప్రధాని అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ నుంచి మేకిన్ ఇండియా వరకు ప్రతీ దానిపై కాంగ్రెస్ సందేహాలు వ్యక్తం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ దురదృష్టమో, దేశ అదృష్టమోగానీ ప్రతీ సవాల్‌ను భారత్ దీటుగా ఎదుర్కొండని అన్నారు. AI సమిట్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు దుస్తులు విప్పుకొని నిరసన తెలపడంపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా టీవీ నైన్ నిర్వహిస్తున్న ఈ సమిట్ నిలవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. భారత దేశ ప్రజలపై ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని ఇది మరింత బలపరచాలని కోరారు. దాదాపు 30 నిమిషాల సేపు సాగిన ప్రసంగంలో ప్రధాని మోదీ అనేకసార్లు టీవీనైన్ కృషిని అభినందించారు.
