
అందంగా కనిపించాలని అమ్మాయిలు రకరకాల చిట్కాలు ప్రయత్నిస్తుంటారు. కొన్ని సత్ఫలితం ఇస్తే.. మరికొన్ని బెడిసికొట్టి మొదటికే మోసం తెస్తాయి. అయితే ఇంట్లో దొరికే పదార్ధాలతో బ్యూటీపార్లర్‌కి మించిన అందం మీ సొంతం కావాలంటే మాత్రం మీరీ విషయం తెలుసుకోవాల్సిందే. సాధారణఃగా చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవడానికి రకరకాల ఇంటి చిట్కాలను పాటిస్తుంటాం. కానీ మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి పరిష్కారం మీ వంటగదిలోనే ఉందని మీకు తెలుసా? అవును.. ఈ విషయంలో మీకు ముందుగా గుర్తొచ్చేవి టమోటాలు లేదా బంగాళదుంపలు. కానీ ఇవి రెండూ కాదు. మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి బియ్యం ఎంతో ఉత్తమమైన ఎంపిక. ముఖ్యంగా బియ్యం కడిగిన తర్వాత వృద్ధాగా పారబోసే బియ్యం నీళ్లు, బియ్యం పిండి… ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
బియ్యంలో విటమిన్ ఇ, ఫెరూలిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి వివిధ చర్మ సమస్యలను వదిలించుకోవడానికి సహాయపడతాయి. అయితే ఈ నీటిని ఎలా ఉపయోగించాలో తప్పక తెలుసుకోవాలి.
బియ్యంతో టోనర్ ఎలా తీయారు చేయాలి?
బియ్యంతో టోనర్ తయారు చేయడానికి అర కప్పు బియ్యాన్ని కడిగి ఒక కప్పు నీటిలో నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఆ నీటిని వడకట్టి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన నీరు చర్మ రంధ్రాలను బిగుతుగా చేయడానికి, ముఖంపై అదనపు నూనెలను నియంత్రించడానికి, నిర్జీవత్వాన్ని తొలగించడానికి చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.
బియ్యం ఫేస్ ప్యాక్ వాడకం ఎలా?
రైస్ ఫేస్ ప్యాక్‌తో కూడా మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌ను తయారు చేయడానికి 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి, 1 టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంకి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత మెల్లగా రుద్దుతూ నీళ్లతో కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల టానింగ్, పిగ్మెంటేషన్, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
బియ్యం నీటితో ఐస్ క్యూబ్
బియ్యం నీటితో ఐస్ క్యూబ్‌లను తయారు చేయడానికి, ఆ నీటిని ఒక ఐస్ ట్రేలో పోసి, ఐస్ క్యూబ్స్‌గా మారే వరకు ఫ్రీజర్‌లో పెట్టాలి. బియ్యం నీటితో చేసిన ఈ ఐస్ క్యూబ్స్‌ను ముఖానికి అప్లై చేయడానికి 1 నుండి 2 నిమిషాల పాటు మీ ముఖంపై సున్నితంగా వీటితో రుద్దాలి. చర్మంపై ఐస్ క్యూబ్‌లను ఉపయోగించడం వల్ల మీ ముఖంపై ఉండే రంధ్రాలు బిగుతుగా మారతాయి. వాపు తగ్గుతుంది. మీ ముఖం ఛాయ ప్రకాశవంతంగా మారుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ జ్ఞానం కోసం ఇచ్చాము. మేము వాటిని నిర్ధారించడం లేదు. దయచేసి వీటిని అనుసరించే ముందు నిపుణులను సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.
