
హైదరాబాద్, మార్చి 29: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 (ఏప్రిల్) పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమవనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు నేడో, రేపో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షల తేదీల్లో మరోమారు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఏప్రిల్ 5న ఈస్టర్ ఆదివారం పండగ ఉంది. దీంతో ఈ రోజున పరీక్షను వాయిదా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చర్చి అధికారులు, సామాజిక ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర పర్యాటక, పెట్రోలియం సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు.
ఏప్రిల్ 2 నుంచి 10 మధ్య జరగాల్సిన JEE మెయిన్ తుది విడత పరీక్షల్లో పవిత్ర వారంతో (హోలీ వీక్) నేపథ్యంలో కేరళలోని కార్డినల్ బసేలియోస్ క్లీమిస్ కాథోలికోస్ సమర్పించిన వినతిపత్రాన్ని ఉటంకిస్తూ తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాసినట్లు గోపి వెల్లడించారు. ఏప్రిల్ 5న పరీక్ష రాయలేని విద్యార్థులకు కొత్త తేదీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని ప్రధాని మోదీ ఫోన్లో తనకు హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో పరీక్ష తేదీ మార్పు కోరుతున్న విద్యార్థులు తమ వివరాలను jeemain.query@nta.ac.in కు ఇమెయిల్ చేయాలని సూచించారు. అభ్యర్థనలను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 28, 2026గా నిర్ణయించారు. దీంతో విద్యార్ధులు శనివారం తమ అభ్యర్ధలను మెయిల్ ద్వారా పంపించారు.
కేరళలోని కాథలిక్ చర్చికి చెందిన కేరళ కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ (KCBC).. మౌండీ థర్స్ డే, ఈస్టర్ సండే వంటి క్రైస్తవ పవిత్ర దినాలలో అఖిల భారత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలను నిర్వహించవద్దని గతంలో అధికారులను కోరింది. కాగా జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షలు ఏప్రిల్ 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో దేశ వ్యాప్తంగా జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఈ పరీక్షలు రెండు షిఫ్టుల్లో ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే పరీక్షా నగరాల వివరాలను ఎన్టీఏ విడుదల చేసింది. జనవరి సెషన్లో దాదాపు 12 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా, ఏప్రిల్ సెషన్‌కు కూడా భారీగా దరఖాస్తులు వచ్చాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
