
జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో వంశపారంపర్యత ఒకటి. మన తల్లిదండ్రులు, తాత ముత్తాతల నుండి వచ్చే జన్యువులు జుట్టు రంగు, ఆకృతి, సాంద్రతను ప్రభావితం చేస్తాయి. అయితే, పూర్తిగా బట్టతల వచ్చిన వారికి ఆహారం ద్వారా జుట్టును తిరిగి పెంచడం సాధ్యం కాదని, అలాంటి సందర్భాలలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మాత్రమే మార్గం నిపుణులు చెబుతున్నారు. కానీ, జుట్టు రాలడాన్ని నివారించి, తిరిగి జుట్టును పెంచడానికి అనేక సహజ పద్ధతులు ఉన్నాయని అంటున్నారు.
జుట్టు రాలడానికి గల ముఖ్య కారణాలు
చుండ్రు: తలలో చుండ్రు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరిచి, జుట్టు అధికంగా రాలడానికి దారితీస్తుంది. అనేక మంది వారానికి ఒకసారి తలస్నానం చేస్తారని, అయితే శరీరానికి రోజూ స్నానం చేసినట్టే తలకు కూడా రోజూ స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. చెమట, వ్యర్థ పదార్థాలు తలలో పేరుకుపోకుండా రోజూ తలస్నానం చేయాలని.. తలస్నానం చేసేటప్పుడు వేళ్ళతో మాడును నెమ్మదిగా రుద్దడం ద్వారా చుండ్రు పూర్తిగా తొలగిపోతుందని, జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయని, దురద వంటి సమస్యలు దరిచేరవని చెబుతున్నారు.
ప్రోటీన్ లోపం: జుట్టు పెరుగుదలకు ప్రోటీన్లు అత్యవసరం. బరువు తగ్గడానికి డైటింగులు చేసేవారు, లేదా సరిపడా ప్రోటీన్ ఆహారం తీసుకోని వారిలో మాంసకృత్తుల లోపం ఏర్పడుతుంది. ఈ లోపం కారణంగా జుట్టు బలహీనపడి, విరిగిపోవడం లేదా ఊడిపోవడం జరుగుతుంది. మొలకెత్తిన విత్తనాలను తినడం ద్వారా మీ శరీరంలో ప్రోటీన్ శాతాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు..
రాలిన జుట్టు తిరిగి రావాలంటే?
మొలకెత్తిన విత్తనాలు ప్రోటీన్‌కు అత్యంత శ్రేష్ఠమైన వనరు నిపుణులు నొక్కి చెప్పారు. గింజలు మొలకెత్తినప్పుడు వాటిలోని ప్రోటీన్ రెట్టింపు అవుతుందని, మొలకలు శరీరం ఉత్పత్తి చేసే హార్మోన్ల పనితీరును కూడా మెరుగుపరుస్తాయని వివరించారు. జుట్టు ఊడిన చోట తిరిగి పెరగడానికి, జుట్టు చిక్కగా, ఒత్తుగా మారడానికి మొలకలు అద్భుతంగా పనిచేస్తాయని తెలిపారు.
మొలకలను సులువుగా తినడానికి కొన్ని చిట్కాలను కూడా నిపుణులు వివరించారు. ఖర్జూరం ముక్కలు, దానిమ్మ గింజలు, ఎండు కిస్‌మిస్‌లు, ఆపిల్, కర్బూజ, ద్రాక్ష వంటి పండ్ల ముక్కలను మొలకలలో కలిపి తినడం వల్ల వాటి పచ్చి వాసన తగ్గి, రుచిగా ఉంటాయని, తద్వారా వాటిని నిరభ్యంతరంగా రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొలకలు కేవలం జుట్టు ఆరోగ్యానికే కాకుండా, థైరాయిడ్ హార్మోన్లు, ఇతర శరీర హార్మోన్లు, శక్తి స్థాయిలు, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా తోడ్పడతాయని తెలిపారు. కాబట్టి, ఆరోగ్యకరమైన జుట్టుతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కోసం మొలకెత్తిన విత్తనాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
