
తీర్థధామ్ సారంగపూర్‌లోని BAPS స్వామినారాయణ్ ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. మార్చి 8న మహాంత్ స్వామి మహారాజ్ పవిత్ర సన్నిధిలో రంగుల పండుగ అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మస్వరూప్ ప్రముఖ్ స్వామి మహారాజ్ ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని వేలాది మంది హరి భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ ఉత్సవం కోసం సుమారు 7.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ సమావేశ మందిరాన్ని సిద్ధం చేశారు. 125 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో నిర్మించిన ప్రధాన వేదికపై స్వామినారాయణ స్వామి దైవిక రూపం, గురు పరంపర, రంగోత్సవ జ్ఞాపకాలను చిత్రీకరించిన దృశ్యాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. దేశవిదేశాల నుండి తరలివచ్చిన సుమారు 75,000 మంది భక్తులకు సంస్థ తరపున ప్రసాద వితరణ జరిగింది.
మహాంత్ స్వామి మహారాజ్ సందేశం
ఈ సందర్భంగా మహాంత్ స్వామి మహారాజ్ భక్తులకు ఆశీర్వచనాలు అందిస్తూ.. ‘‘మన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యం. భక్తి అనే రంగుతో మన అంతరాత్మను అలంకరించుకోవాలి. మన మనసులో దేవుడు తప్ప మరే ఇతర ఆలోచనలు ఉండకూడదు’’ అని ప్రబోధించారు.
రంగూ రంగో మహాంత్జీ రంగో – సాంస్కృతిక వేడుక
సాయంత్రం 4:45 గంటలకు ప్రారంభమైన ఈ ప్రధాన ఉత్సవం భక్తి గీతాలతో మార్మోగింది. మంచి మనుషులు దేవునితో కనెక్ట్ అవుతారు” అనే ఇతివృత్తాలతో ప్రముఖ సాధువులు పూజ్య వివేక్‌సాగర్ స్వామి, పూజ్య భద్రేష్ స్వామి, పూజ్య ఆనంద్ స్వరూప్ స్వామి తదితరులు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు.
సాంస్కృతిక ప్రదర్శనలు
సాయంత్రం వేళ సాధువులు, యువకులు పాడిన భక్తి గీతాలు, దైవిక జీవితాన్ని ప్రతిబింబించే ప్రదర్శనలు ఉత్సవానికి మరింత శోభను ఇచ్చాయి. వేడుక చివరలో మహాంత్ స్వామి మహారాజ్ స్వయంగా కేసరి, సువాసనల నీటిని స్ప్రింక్లర్ల ద్వారా భక్తులపై చల్లారు. తమ గురువు చేతుల మీదుగా రంగుల వర్షంలో తడిసిపోవడాన్ని భక్తులు మహా ప్రసాదంగా భావించి పులకించిపోయారు. ఈ భారీ కార్యక్రమం విజయవంతం కావడానికి 5,000 మంది స్వచ్ఛంద సేవకులు రేయింబవళ్లు శ్రమించారు. వచ్చిన భక్తులందరికీ ఆహార ప్యాకెట్లను ప్రసాదంగా అందించారు.
