
జగిత్యాల కోటిలింగాల గ్రామానికి చెందిన మణితేజ్ను 2024 డిసెంబర్ 26న ఒక కుక్క కరిచింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాలుడిని సమీప ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. మొదట్లో పెద్దగా ప్రమాదం లేదని భావించిన కుటుంబానికి.. కొద్ది రోజుల తరువాత బాలుడి ఆరోగ్యం క్షీణించడం ఆందోళన కలిగించింది. అనారోగ్య లక్షణాలు కనిపించడంతో బాలుడిని మళ్లీ వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. రేబీస్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.
బాలుడి ప్రాణాలను కాపాడేందుకు పలు ఆస్పత్రులతో చికిత్స చేయించారు. చికిత్స కోసం కుటుంబం తీవ్రంగా శ్రమించింది. దాదాపు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చు చేసినప్పటికీ.. బాలుడి ఆరోగ్యం మెరుగుపడలేదు. 15 నెలల పాటు ప్రాణాలతో పోరాడిన మణితేజ్ చివరకు మృతి చెందాడు. ఈ విషాదంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనతో కోటిలింగాల గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గ్రామస్థులు బాలుడి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న కాటు.. ఒక కుటుంబాన్ని చిదిమేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు ఈ ఘటనపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కుక్క కాటు జరిగిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే యాంటీ రేబీస్ టీకాలు వేయించుకోవాలని సూచించారు. పూర్తి స్థాయిలో చికిత్స చేయించకపోతే రేబీస్ ప్రాణాంతకమవుతుందని పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
