
పెళ్లి సందడి నెలకొన్న వేళ ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకున్న ఘటన విజయనగరం జిల్లాలో హృదయవిదారంగా మారింది. మరో 13 రోజుల్లో అక్క వివాహం జరగాల్సి ఉండగా, ఇంట్లో పెళ్లి ఏర్పాట్లలో అంతా బిజీగా ఉన్న సమయంలో ఆ కుటుంబానికి తీరని లోటు తలెత్తింది. తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన ఆకుల ఏడుకొండలు (17) అనే ఇంటర్ విద్యార్థి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన సోమవారం గజపతినగరంలో కలకలం రేపింది.
ఇటీవలే ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసి వచ్చిన ఏడుకొండలు ఇంట్లో పెళ్లి పనుల్లో సహాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి కొంత సమయం క్రికెట్ ఆడుకుని వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన ఏడుకొండలు గజపతినగరం జాతీయ రహదారి సమీపంలోని కళాశాల మైదానానికి వెళ్లి ఆట ముగించుకుని తిరిగి వస్తుండగా, సెంట్రల్ లైటింగ్‌కు చెందిన విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడున్న వారు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
కుమారుడి మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కృష్ణవేణి, గౌరి బాబు దంపతులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏప్రిల్ 12న జరగాల్సిన అక్క వర్ష వివాహం ఇంట్లో ఉండగా ఈ ఘటన జరగడం గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదానికి విద్యుత్ శాఖ, జాతీయ రహదారి అథారిటీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
