
సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆ యువ జంట నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంది. చిన్నపాటి కుటుంబ కలహాలు, పెరిగిపోయిన మానసిక ఒత్తిడి ఇద్దరు ఐటీ ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకున్నాయి. తెలంగాణకు చెందిన దంపతులు బెంగళూరులోని తమ నివాసంలో బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన భాను చందర్ రెడ్డి, ఆయన భార్య బీబీ షాజియా సిరాజ్ బెంగళూరులోని కొత్తనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ప్రైవేట్ కంపెనీల్లో టెక్నీషియన్లుగా పనిచేస్తూ స్థిరపడ్డారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
సోమవారం మధ్యాహ్నం షాజియా ఇంట్లో లేని సమయంలో భాను చందర్ రెడ్డి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బయటి నుంచి వచ్చిన షాజియా, ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి సెక్యూరిటీ గార్డుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూసింది. అక్కడ విగతజీవిగా పడి ఉన్న భర్తను చూడగానే ఆమె తట్టుకోలేకపోయింది. ఆ తీవ్ర దిగ్భ్రాంతిలో ఏం చేయాలో తోచక, భర్త చనిపోయిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే అపార్ట్మెంట్లోని 17వ అంతస్తు నుండి దూకి తను కూడా ప్రాణాలు వదిలింది.
కారణం అదేనా?
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ దంపతులు గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పని ఒత్తిడికి తోడు కుటుంబ కలహాలు తోడవడంతో ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కొత్తనూరు పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెండు వేర్వేరు అసహజ మరణం కేసులు నమోదు చేశారు. ‘‘ పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయి. ప్రస్తుతం వారి వ్యక్తిగత, వృత్తిపరమైన నేపథ్యాలపై ఆరా తీస్తున్నాం’’ అని పోలీసులు తెలిపారు.
ఎంతో భవిష్యత్తు ఉన్న యువ జంట ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. సమస్య ఏదైనా సరే.. ఆత్మహత్య పరిష్కారం కాదని, మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు నిపుణుల సాయం తీసుకోవాలని సామాజికవేత్తలు కోరుతున్నారు.
