
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో దొంగలు రెచ్చిపోయారు. జలాల్ బాబా నగర్‌లో ఫిరోజ్ అనే వ్యాపారి ఇంట్లో చొరబడిన దొంగలు భారీ దోపిడీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. వ్యాపారి ఫిరోజ్ తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఐదుగురు దుండగులు బైక్‌లపై వచ్చి రెక్కీ నిర్వహించారు. నిందితుల్లో ఒకడు ముఖానికి టవల్ కట్టుకుని లోపలికి ప్రవేశించి, బెడ్‌రూమ్ అల్మరాను ధ్వంసం చేశాడు. అందులో ఉన్న రూ. 20 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దోచుకుని పరారయ్యారు. తిరిగి వచ్చిన యజమాని… ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించి లబోదిబోమంటూ ‘డయల్ 100’కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, నిందితులు ఫిరోజ్ బయటకు వెళ్లిన విషయాన్ని పక్కాగా గమనించి ఈ స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతోంది. బాధితుడికి అత్యంత సన్నిహితులు లేదా తెలిసిన వారి ప్రమేయం ఉందేమో అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవుల్లో చాలామంది విహారయాత్రలకు, ఊర్లకు వెళ్తుంటారు. ఇళ్లు ఖాళీగా ఉండటాన్ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లకు సెక్యూరిటీ కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలని, విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి
