
ఇరాన్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మోజ్తాబా ఖమేనీ, తన మొదటి ప్రకటనతోనే పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందేశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని మోజ్తాబా హెచ్చరించారు. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను వెంటనే మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘అమెరికా శాంతిని నెలకొల్పుతుందనేది ఒక అబద్ధం. వారి సైనిక స్థావరాలు ఇక్కడ కొనసాగితే దాడులు తప్పవు’’ అని ఆయన స్పష్టం చేశారు.
తండ్రి బాటలోనే ప్రతీకారం
తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యను ప్రస్తావిస్తూ మోజ్తాబా భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి మృతదేహాన్ని చూసినప్పుడు ఆయన పిడికిలి బిగించి ఉందని.. అది ఆయన దృఢత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. తన తండ్రితో పాటు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి పౌరుడి రక్తం సాక్షిగా శత్రువుల నుండి పరిహారం వసూలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఒకవేళ శత్రువు నిరాకరిస్తే, వారి ఆస్తులను నాశనం చేస్తామని హెచ్చరించారు.
యుద్ధం ముగియాలంటే మూడు షరతులు
మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఈ వివాదాన్ని ముగించడానికి మూడు ప్రధాన షరతులను తెరపైకి తెచ్చారు..
- ఇరాన్ యొక్క సార్వభౌమత్వాన్ని గుర్తించాలి.
- యుద్ధం వల్ల జరిగిన నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ భారీ పరిహారం చెల్లించాలి.
- భవిష్యత్తులో ఇరాన్‌పై ఎటువంటి దాడులు జరగవని అంతర్జాతీయ సమాజం గ్యారెంటీ ఇవ్వాలి.
- రష్యా, పాకిస్తాన్ నాయకులతో మాట్లాడిన పెజెష్కియన్, ఈ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేదే లేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
ఆర్థికంగా దెబ్బకొడుతున్న ఇరాన్
యుద్ధం ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. పెర్షియన్ గల్ఫ్‌లో షిప్పింగ్ ట్రాఫిక్‌పై ఇరాన్ దాడుల నేపథ్యంలో చమురు ధరలు బ్యారెల్‌కు 100డాలర్ల మార్కును దాటేశాయి. ఆర్థికంగా ప్రపంచ దేశాలకు ఇబ్బంది కలిగించడం ద్వారా అమెరికా, ఇజ్రాయెల్‌లు తమ బాంబు దాడులను ఆపేలా ఒత్తిడి తీసుకురావడమే ఇరాన్ అసలు వ్యూహంగా కనిపిస్తోంది.
రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు మద్దతు
లెబనాన్‌లోని హిజ్బుల్లా, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్‌లోని సాయుధ సమూహాలకు మోజ్తాబా ఖమేనీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెసిస్టెన్స్ ఫ్రంట్ యోధులు ఇరాన్ వెన్నంటి ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోజ్తాబా ఖమేనీ ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరో స్థాయికి చేరుకున్నాయి. తండ్రి కంటే కఠినమైన నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తుండటంతో, అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.
