ఏలూరు జిల్లా పెద్దవేగి మండలం నాగన్న గూడెం గ్రామానికి చెందిన 20 ఏళ్ల భీముడు అజిత్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ డిఎస్పి కృష్ణ ప్రసన్న తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఓఎల్ఎక్స్ లో కార్ డీలర్ గా నటిస్తూ కార్లు అమ్మే వారిని సంప్రదించేవాడు.
అదే సమయంలో కార్ డీలర్లతో యజమానిగా నటిస్తూ కార్ల కొనుగోలు కోసం మాట్లాడేవాడు. ఇలా ఇద్దరినీ నమ్మించి డబ్బులు ఇతర ముఠా సభ్యుల ద్వారా బంగారు దుకాణం యజమానుల పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాలో జమ చేసేవాడు. ఆ డబ్బుతో వెంటనే బంగారం కొనుగోలు చేసి దానిని బెంగళూరు , తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలలో అమ్మేవాడని పోలీసులు తెలిపారు.
నిందితులపై ఏపీ , తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 12 కేసులను నమోదు అయ్యాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ లో 8 కేసులు నమోదు కాగా,తెలంగాణలో రెండు తమిళనాడులో రెండు కేసులు ఉన్నాయి.
ఈ కేసుల ద్వారా బాధితుల నుంచి సుమారు 94 లక్షల రూపాయలు మోసం చేసినట్టు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 50 లక్షల విలువైన ఆస్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 37 లక్షల రూపాయల నగదు 49 గ్రాముల బంగారం ఉంది
నిందితులపై తెలంగాణలో రెండు , తమిళనాడులో ఒక నాన్వెలబుల్ వారెంట్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా సుమారు 20 చీటింగ్ కేసులో ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అనుమానస్పద వ్యక్తులకు డబ్బులు పంపకూడదని పోలీసులు సూచనలు చేస్తున్నారు





