దేశానికి యువతే అతి పెద్ద బలం అని మనం తరచూ గర్వంగా చెబుతుంటాం. కానీ, తాజాగా వెలువడిన ఓ గ్లోబల్ నివేదిక మాత్రం ఆ ఆత్మవిశ్వాసాన్ని కాస్త కదిలించింది. నేటి తరం యువత మానసికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ప్రపంచ స్థాయిలో వారి స్థితి ఆశాజనకంగా లేదని వెల్లడైంది. సాపియన్ ల్యాబ్స్ విడుదల చేసిన ‘గ్లోబల్ మైండ్ హెల్త్ ఇన్ 2025’ నివేదిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పెద్దలు స్ట్రాంగ్.. యువత వీక్..
ప్రపంచవ్యాప్తంగా 84 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో భారతీయ యువత మానసిక ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగించేలా ఉందని తేలింది. 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు గల యువత మానసిక ఆరోగ్య పరంగా ప్రపంచ ర్యాంకింగ్స్లో 60వ స్థానంలో నిలిచారు. వీరి మైండ్ హెల్త్ కోషెంట్ (MHQ) స్కోర్ కేవలం 33 మాత్రమే నమోదైంది.
ఇదే సమయంలో 55 ఏళ్లు పైబడినవారు మానసికంగా మరింత స్థిరంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. ఈ వయసు వర్గానికి చెందిన వారి MHQ స్కోర్ 96గా ఉండగా, వారు 49వ స్థానంలో నిలిచారు. అంటే నేటి యువత కంటే పాత తరం పెద్దవారే మానసిక దృఢత్వంలో ముందున్నారని ఈ నివేదిక సూచిస్తోంది.
అసలు కారణాలు ఏంటి?..
ఒకప్పుడు పిల్లలు ఉమ్మడి కుటుంబాల్లో పెరిగి, బయట ఆటలు ఆడుతూ సంతోషంగా గడిపేవారు. కానీ ఇప్పుడు జీవనశైలి పూర్తిగా మారిపోయింది. రిపోర్ట్ ప్రకారం యువతలో సుమారు 41 శాతం మంది డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
1. స్మార్ట్ఫోన్ ప్రభావం:
చిన్న వయస్సు నుంచే మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, డిజిటల్ స్క్రీన్లకు అలవాటు పడటం.
2. ఆహారపు అలవాట్లు:
పోషకాహారం తగ్గి, జంక్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం.
3. ఒంటరితనం:
కుటుంబ సభ్యులతో సమయం గడపకపోవడం, నిజమైన సంబంధాల కంటే వర్చువల్ ప్రపంచానికే పరిమితం కావడం.
భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం..
ఈ పరిస్థితి తాత్కాలికం కాదని, తరాల మధ్య వస్తున్న పెద్ద మార్పుకు ఇది సంకేతమని సాపియన్ ల్యాబ్స్ వ్యవస్థాపకురాలు తారా త్యాగరాజన్ తెలిపారు. చిన్న చిన్న ఒత్తిడులను కూడా తట్టుకోలేకపోవడం, భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం, ఏకాగ్రత తగ్గిపోవడం వంటి సమస్యలు యువతలో పెరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన యువశక్తి ఇలా మానసిక ఒత్తిడికి లోనవడం దేశ ఆర్థిక వ్యవస్థపై, ఉత్పాదకతపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసిక ఆరోగ్యంపై ఇప్పటికైనా ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, సమాజం మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. లేకపోతే దేశానికి బలం కావాల్సిన యువత… భవిష్యత్తులో భారంగా మారే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.





