తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అభిషేక్ మనుసింఘ్వీ, కేఆర్ సురేష్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రెండు సీట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడనున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. పైగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కేసులను అటు సుప్రీంకోర్టు ఇటు తెలంగాణ హైకోర్టులో కూడా ఆయనే వాదిస్తున్నారు. దీంతో అభిషేక్ మనుసింఘ్వీకి పార్టీ అధిష్టానం మరో అవకాశం ఇచ్చింది. నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు అభిషేక్ మను సింఘ్వీ. ఇక రెండో స్థానం కోసం తెలంగాణ నుంచి రాజ్యసభకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ రెడ్డిని ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ. కాగా వీరిద్దరు గురువారం నామినేషన్ వేసే అవకాశం ఉంది. రాజ్యసభ సీటు కోసం అధికార పార్టీలో దాదాపు 16 మంది పోటీ పడ్డారు. వారిలో సీనియర్లే కాదు సూపర్ సీనియర్లు సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి ఎంపికపై పార్టీ అగ్రనాయకత్వంతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో చర్చించారు. చివరకు వేం నరేందర్ రెడ్డి వైపు పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ ఎన్నికలో సరిపడ బలం లేకపోయినా 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేందుకు అభ్యర్థిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. అయితే ఏ సామాజికవర్గానికి టికెట్ ఇచ్చినా ఓడిపోయే సీటు ఇచ్చారన్న విమర్శలు ఎదురవుతాయని గులాబీ పార్టీ ఆలోచిస్తోంది. దీంతో గులాబీ పార్టీ పోటీపై డైలమాలో పడిపోయింది. అసెంబ్లీలో అధికారికంగా 37మంది సభ్యులున్న BRSకు.. ఫిరాయింపు ఎమ్మెల్యేల కారణంగా ఆ సంఖ్య 27కు పడిపోయింది. అయితే, రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీ చేయడం ద్వారా.. ఫిరాయింపు ఎమ్మె్ల్యేలకు చెక్ పెట్టాలని చూస్తోంది. రెండో రాజ్యసభ స్థానాన్ని దక్కించుకునేందుకు.. కాంగ్రెస్‌కు అవసరమైన బలం, BRS ఫిరాయింపు ఎమ్మెల్యేలే కాబట్టి.. ఆ మార్గానికి అడ్డుకట్ట వేసేందుకు విప్ ఆయుధాన్ని విసరాలని చూస్తోంది. ఒకవేళ బీఆర్‌ఎస్ అభ్యర్థిని నిలపడం ఖాయమైతే.. రెండు స్థానాలను ఏకగ్రీవం చేసుకునే అవకాశం కాంగ్రెస్‌కి ఉండదు. అంతేకాదు, విప్ ధిక్కరించే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తప్పించుకునే ఛాన్సూ ఉండకపోవచ్చు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో న్యాయపరమైన పోరాటం చేసి.. స్పీకర్ నిర్ణయంతో నిరుత్సాహం చెందిన BRS.. తన పాచికతో ఈసారైనా సక్సెస్ అవుతుందా? లేదా? అన్నదే ఆసక్తిరేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
