సూర్య దేవాలయాల రహస్యాలు
భారతదేశంలో ప్రసిద్ధ ఆదిత్య (సూర్య) ఆలయాలు – పూర్తి వివరాలు
ప్రపంచానికి వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడిని ప్రత్యక్ష నారాయణుడిగా కొలుస్తారు.
సూర్య దేవుడి ఆలయాల వెనుక ఉన్న పురాణ కథలు
సూర్యుడిని జ్యోతిషశాస్త్రం గ్రహరాజుగా పరిగణిస్తుంది. మన దేశమంతటా ప్రాచీనకాలంలో వ్యాప్తిలో ఉన్న పణ్మతాలలో సౌరమతం కూడా ఒకటి.
మన దేశంలోనే కాదు, ప్రాచీనకాలంలో ఇతర దేశాలలో కూడా సౌర ఆరాధన ఉండేది. చరిత్రను వరిశీలిస్తే. ఆదిత్యుడినే ఆదిదేవుల చెప్పవచ్చు. ప్రాచీన ఈజిప్టు భూభాగంలో చరిత్ర పూర్వయుగం నుంచే సూర్య ఆరాధన వ్యాప్తిలో ఉండేది.
ఈజిప్షియన్ ప్రజల నూర్యుడిని ‘ర’, ‘రౌ’ అనే పేర్లతో పూజించేవారు. క్రీస్తుపూర్వం మూడో సహస్రాబ్ది నాటికి ఈజిప్షియన్ల ప్రధాన దైవాలలో ‘ర’కు ప్రత్యేక స్థానం ఉండేది.
క్రీస్తుపూర్వం రెండో సహస్రాబ్దిలో వర్ధిల్లిన మెసపొటేమియన్ నాగరికతకు చెందిన ప్రజలు నూర్యుడిని ‘షమాష్’ అనే పేరుతోను, సుమేరియన్లు ‘ఊటూ’ అనే పేరుతోను పూజించేవారు. క్రీస్తుపూర్వం రెండో సహస్రాబ్దిలోనే భారత భూభాగంలో మొదలైన వైదిక యుగంలో వైదికార్యులు నూర్యుడిని విశేషంగా ఆరాధించేవారు.
సూర్యుడిని ఆరోగ్యప్రదాతగా వేదాలు కీర్తించాయి. సౌర ఆరాధనకు నిదర్శనంగా పురాతనమైన కొన్ని సూర్య దేవాలయాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ఆలయాల గురించి తెలుసుకుందాం…
మార్తాండ దేవాలయం
ఇది కశ్మీర్ లోని మట్టన్ పట్టణంలో ఉంది. దేశంలోని పురాతన సూర్య దేవాలయాలలో ఇదొకటి. పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ సూర్య దేవాలయం సుమారు క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది నాటిది. ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుకుంది. విదేశీయుల దాడుల్లో కొంత, తర్వాత సంభవించిన

భూకంపాలలో కొంత ఈ ఆలయం చాలావరకు ధ్వంసమైంది. పీఠభూమి ప్రాంతంలో ఉన్న మట్టన్ పట్టణంలో ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన మార్తాండ ఆలయం వద్ద నుంచి తిలకిస్తే, దిగువనున్న కశ్మీర్ లోయ ప్రాంతం అంతా కనిపిస్తుంది.
మార్తాండ ఆలయ ప్రాంగణంలో 84 ఉపాలయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయ పరిరక్షణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది.
కోణార్క దేవాలయం
ఈ ఆలయం ఒడిశాలోని కోణార్క పట్టణంలో ఉంది. తూర్పు గంగవంశానికి చెందిన గజపతి లాంగూల నరసింగదేవుడు పదమూడో శతాబ్దిలో దీనిని నిర్మించాడు.

దీని నిర్మాణం 1238-64 మధ్య కాలంలో జరిగింది. కళింగ శిల్పకళా చాతుర్యానికి అద్దం పట్టే కోణార్క ఆలయంలో ప్రధానంగా రెండు నిర్మాణాలు కనిపిస్తాయి.
వీటిలో ఒకటి నాట్యమండపం కాగా, మరొకటి గర్భాలయం. ఈ ఆలయం కొంత శిథిలమైనా, చాలావరకు శిల్పసంపద ఇంకా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.
ఈ ఆలయంలో ముప్పయిమూడు అడుగులకు పైగా ఉండే అరుణ స్తంభం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. సూర్యుడి రథాన్ని పోలిన ఆలయ నిర్మాణం, రథ చక్రాలపై సైతం సూక్ష్మమైన శిల్పాలు ఆనాటి శిల్పుల నైపుణ్యానికి అద్దం పడతాయి.
పూరీలో వెలసిన జగన్నాథుడి ఆలయానికి కోణార్క ఆలయాన్ని సింహద్వారంగా భావిస్తారు. ఈ ఆలయంలో పలు కళా సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఈ వేడుకలతో పాటు కోణార్క సముద్ర తీరంలో ఏటా కోణార్క్ బీచ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది.
రహీల్యా సాగర్ సూర్య దేవాలయం
ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని మహోబా పట్టణంలో ఉంది. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దికి చెందిన చందేలా రాజు రహీలా ఈ సూర్య దేవాలయాన్ని నిర్మించాడు.

రహీల్యా సాగర్ తటాకం ఒడ్డున నిర్మించిన ఈ ఆలయం ఆనాటి శిల్పకళా వైభవానికి నిదర్శనంగా ఈనాటికీ నిలిచి ఉంది. ఈ ఆలయం ఉన్న మహోబా పట్టణాన్ని త్రేతాయుగంలో కేకపురం అని. ద్వాపరయుగంలో పాటనపురం అని పిలిచేవారని చెబుతారు.
మహోబా పట్టణం, ఆ పరిసరాలకు సంబంధించి పలు పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. వనవాస కాలంలో సీతారాములు ఇక్కడ కొన్నాళ్లు గడిపినట్లు చెబుతారు. ఇక్కడకు సమీపంలోని తటాకాన్ని ‘రామకుండ్’ అంటారు.
గోరఖ్గిరి కొండ గుహను ‘సీతా రసోయి’ అంటారు. ఈ తటాకంలోనే సీతారాములు స్నానాలు చేసేవారని, గుహలో సీతమ్మవారు వంటచేసేవారని చెబుతారు.
చందేలా రాజులు చంద్రవంశీకులైనా, ఈ ప్రదేశానికి సూర్యవంశీయుడైన రాముడితో సంబంధం ఉండటంతో ఇక్కడ సూర్య దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు.
ఈ ఆలయంలో సభా మంటపం, గర్భాలయం ప్రధాన భాగాలుగా కనిపిస్తాయి. వినాయకుడు, త్రిమూర్తులు సహా అనేక దేవతలు, పురాణగాథల శిల్పాలు ఆలయ కుడ్యాలు, స్తంభాలపై కనువిందు చేస్తాయి.
ప్రస్తుతం ఈ ఆలయాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తోంది.
మోధేరా సూర్య దేవాలయం
గుజరాత్లోని మెహసానా జిల్లా మోధేరా గ్రామంలో ఉంది. చాళుక్య/ సోలంకీ వంశానికి చెందిన ఒకటో భీముడు మోధేరా గ్రామంలో సూర్య దేవాలయాన్ని పుష్పావతీ నదీతీరంలో నిర్మించాడు.
ఈ ఆలయం వద్ద నిర్మించిన శిలా శాసనం ప్రకారం దీని నిర్మాణం విక్రమశకం 1083 (క్రీస్తుశకం 1026-27) సంవత్సరంలో జరిగినట్లు తెలుస్తోంది. మారు గుర్జర వాస్తు శైలిలో చేపట్టిన ఈ ఆలయ నిర్మాణం ఆనాటి శిల్పకళా వైభావాన్ని నిదర్శనంగా నిలిచి ఉంది.

ఈ ఆలయంలో ప్రవేశమార్గంలో కీర్తితోరణం, దానికి ఎదురుగా సభా మండపం, అది దాటిన తర్వాత గూఢమండపం, లోపల గర్భాలయం ఉంటాయి.
రాతిగోడలు, స్తంభాలపై చెక్కిన శిల్పాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలోనే సూర్యకుండం అనే మెట్లబావి కూడా ఉంది.
వనవాసకాలంలో సీతారాములు ఇక్కడ గడిపినట్లు గాథలు ప్రచారంలో ఉండటంతో సూర్యకుండాన్నే రామకుండం అని కూడా అంటారు.
ఈ ఆలయంలో ప్రతిఏటా మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ మహోత్సవం, మాఘ శుక్ల సప్తమి రోజున రథసప్తమి పర్వదినాలు ఘనంగా జరుగుతాయి.
ఉత్తరాయణ మహోత్సవం సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణంలో ఏటా నాట్యోత్సవం కూడా జరుగుతుంది.
ఇంకావుంది……
NEXT PAGE-2
