
ఏపీలోని కూటమి ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాలు ప్రజలకు వేగంగా, సులభంగా అందించేందుకు సాంకేతికను ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను సులువుగా పొందే అవకాశం తీసుకురాగా.. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా పంపిణీ చేసింది. ఇక ఇటీవల క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేసింది. ఈ క్యూర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా అన్నీ వివరాలను సులభంగా అధికారులు యాక్సెస్ చేయవచ్చు. దీని వల్ల పౌర సేవలను ప్రజలకు సులవుగా అందించడంతో పాటు పారదర్శకత ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే త్వరలో ప్రభుత్వం మరో స్మార్ట్ కార్డ్‌ను రాష్ట్రంలోని ప్రజలందరికీ అందించేందుకు సిద్దమవుతోంది.
ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్
త్వరలోనే రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్‌ను ప్రభుత్వం పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. బుధవారం నుంచి సచివాలయంలో కలెక్టర్ల మీటింగ్ సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో స్మార్ట్ కార్డులపై చర్చ జరగ్గా.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ స్మార్ట్ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ స్కాన్ చేయగానే కుటుంబ వివరాలు అన్నీ తెలిసిపోతాయి. ఏయే పథకాల వల్ల లబ్ది పొందుతున్నారు..? ఆర్ధిక పరిస్థితులు, మొబైల్ నెంబర్లు, అడ్రస్, విద్యా సమాచారం, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు, ఫ్యామిలీ ఐడి, వృత్తి, ఆస్తి వివరాలు లాంటి అన్నీ వివరాలు తెలుసుకోవచ్చు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఇది సహాయపడతుంది. ఇక ఏదైనా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు.
ఒక్క కార్డుతో అన్నీ పనులు
ఈ ఒక్క కార్డు ఉంటే చాలు ప్రభుత్వ సర్వీసులన్నీ పొందవచ్చు. అందుకోసం వేర్వేరు డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన పని తప్పుతుంది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. 26 అంశాలతో కూడిన వివరాలు యాప్ ద్వారా నమోదు చేసే ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటివరకు 82 శాతం మంది వివరాలను సేకరించడం పూర్తవ్వగా.. ఏప్రిల్ 30 నాటికి 90 శాతం మంది డేటాను నమోదు చేయనున్నారు. అనంతరం ఈ కార్డులు ప్రింట్ చేసి ప్రతీ కుటుంబానికి అందిస్తారు. ఇక కార్డుల్లోని వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలు అప్డేట్ చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. కార్డులు తప్పులు దొర్లినా, వివరాలు అప్డేట్ చేసుకోవాలన్నా గ్రామ, వార్డు సచివాలయా ద్వారా ప్రజలు చేసుకోవచ్చు.
